Jagathguru Bhodalu Vol-5        Chapters        Last Page

కళద్వారా చిత్తశాంతి.

గ్రంథ పఠనంవల్ల, ఉపన్యాస శ్రవణంవల్ల మనస్సుకు భావగ్రహణం చక్కగా లభిస్తుంది. ఆ ఉపన్యాసమేగానముతో కూడుకునివుంటే హరికథా కాలక్షేపంవలె మరీ మనోరంజక మవుతుంది. అలాగే గ్రంథంకూడా శబ్దార్థాలంకారాలతో విభావాదివర్ణనలతో కూడుకుని ఉంటే అందలి భావసౌందర్యం ఎంతో హృదయంగమ మవుతుంది. ఆ గ్రంథములే మహాకవి రచిత కావ్యములయితే మరి చెప్పేదేమిటి? కావ్యములు- శ్రవ్యములు-వినదగినవి. దృశ్యములు-చూడదగినవి, అని రెండు విధాలు. దృశ్యకావ్యములనే నాటకము లంటాము. చెవితో విన్నదానికంటే రంగస్థలమందు కండ్ల ఎదుట ప్రదర్శితమైనభావం సరాసరిగా హృదయాన హత్తుకొంటుంది. భాస కాళిదాస భవభూత్యాదులగు మహాకవులు చిరకాలమునాడే ఇట్టినాటకాలు రచించారు.

అచ్చుయంత్రం వచ్చినపిమ్మటచేతితో గ్రంథప్రతుల్లు వ్రాసుకునే శ్రమ తప్పిపోయి, వేలకొలది ప్రతులిట్టే సిద్దమవు తున్నవి. అట్లే ఇపుడు సినిమావచ్చింది కనుక, నాటకాన్ని నటులు మాటిమాటికి ప్రదర్శింపనక్కరలేదు. ప్రదర్శనాన్ని ఒక్కసారి సినిమాతీస్తే, దాన్నినే ఎన్ని సార్లయినా మనం చూస్తూవుండవచ్చు.

చిత్త మందుపుట్టే రసభావాలన్నిటికీ నాటకమందు ప్రవేశమున్నప్పటికీ ఒక్కొక్క నాటకం ఒక్కొక్కరసాన్ని ప్రధానంగాను, తక్కినవానిని అప్రధానంగాను ప్రదర్శిస్తూంది. ప్రధానమైన అంగిరసానికి తక్కినవి అంగములుగా ఉంటవి. మహావీరచరితం, వేణీ సంహారము అనే నాటకాలలో వీరం ప్రధానరసం. అట్లేశృంగార హాస్య కరుణాదులు కొన్ని నాటకాలలో ప్రాధాన్యం వహిస్తవి. నవరసాలలో శాంతరసం అగ్రగణ్యం. ఒక్కొక్క విధమయిన చిత్తవికారంవల్ల శృంగారాదిరసాలు పుట్టుతవి. శాంతరసం అట్టిదికాదు. వృత్తిరహితమై నిర్వికారమైన చిత్తస్థితినే శాంతమంటాము. కనుకశాంతమును నవరసాదులలో గణించకూడదనే మతభేదం ఉంది. ఆలంకారికులలో ఇతర రసములందు చింతాజడత్వాది వ్యభిచారిభావాలకు ప్రాధాన్యం వుంటుంది. కనుక స్థిరమైన ఆనందాన్ని కలిగించవు. శాంతరసము నిర్వికారము, సాత్త్వికము కావడంవల్ల దానిచే అభంగురము, సుస్థిరము అయిన ఆనందం లభిస్తుంది. త్యాగయ్యగారు చెప్పినట్లు ''శాంతములేక సౌఖ్యములేదు.'' కావున యితర రసములందుండే రంజకత్వము, ఉద్దీపనము లేకున్నను శాంతమునకు స్వతః రసత్వమున్నదని చెప్పవచ్చు.

జిహ్వకు రుచినిపుట్టించే కటుతిక్తావ్లుకషాయాదిషడ్రసములు కూడా ఈ నవరసాల వంటివే. ఈ షడ్రసాలు పాళ్ల చొప్పున ఒంటొంటితో కలిసి సంతోషాన్ని కలిగిస్తవే కాని, స్వభావముచే సాత్వికములు కావు. నాలుకపై రుచుల నుద్దీపింపచేసి ఇవి మనస్సును తల్లడిపెట్టుటేతప్ప చిత్తమునకు శాంతి నివ్వజాలవు. వీనిలోచక్కెరమున్నగు వానియందు మాధుర్యం లభిస్తుంది. ఆమాధురంకూడ మితిమీరితే మొగంమొత్తుతుంది. ఎంత అనుభవించినాతృప్తితీరని మాధుర్యంమరొకటి వున్నది. దానినే మధు-రసమంటారు. రుచినిపుట్టించేషడ్రసాలలో ఏదీ అందులో కలియదు. అది సాత్వికము, శ్రీకృష్ణుడారగించేదదే! విశుద్ధవర్ణము. కేవల సాత్వికము అయిన నవనీతమే ఆ పదార్ధం, కృష్ణునినోటినిండా వెన్నా, మనమునిండా ఆనందమూను, ఆవెన్నచే మొగముమొత్తదు తనివితీరదు. వెన్నయందు లభించే మధురరసమే శాంతరసం.

రంగులప్రస్తావం వచ్చినప్పుడు వానిలో నలుపు తెలుపు అంటూ బేధంచేస్తాము. నలుపు తెలుపు వేర్వేరుగా మన కంటికి కనుబడునేగాని, నిజానికవి వర్ణములు కావని సైన్సు చెబుతుంది. సూర్యుడు ఏడుగుర్రాలరథంమీదప్రయాణంచేస్తున్నట్లు పురాణములు వర్ణిస్తవి. వేదములుకూడా సూర్యుని సప్తాశ్వుడంటున్నవి. ఈయశ్వశబ్దానికి, నిరుక్తం కిరణమని అర్థంచెపుతున్నది. కావున సప్తాశ్వుడంటే సప్తకిరణాలుకలవాడని గ్రహించాలి. పూర్వం సంపన్నులఇండ్లలో స్ఫటికగోళములుగృహములకలంకారంగా వ్రేలాడుతూవుండేవి. వానిలో దీపములు వెలిగించేవారు. ఆగోళములు దీపములతో వూగులాడినప్పుడు ఏడురంగులుగా కనుపించేవి. ఆఏడువర్ణములు ఏకమైనప్పుడు తెల్గగా కనుపించునేకాని, తెలుపు వేరేరంగు కాదు. శుద్ధమైన తేజస్సే తెల్లగా కనిపిస్తుంది. ఆవిశుద్ధకాంతిని మూడుపలకల కాచఖండములోనుండి చూస్తే ఏడురంగులుగా కానవస్తుంది. ఈ యేడురంగులను సమపాళ్లుగా కలిపితే తెల్లని తేజము లభిస్తుందని సైన్సు తెలియచెప్పుతున్నది. చమురు దీపం ఎర్రగాకనుపిస్తుంది. చమురునందుఆయెరుపుపాళ్లెక్కువగా వుండుటే దానికి కారణం.

నేతి దివ్వెయం దంత ఎరుపు కనిపించదు. నూనెకంటె నేయి పరిశుద్ధం కనుకనే దేవాలయములందు గర్భగుడిలో స్వామిసన్నిధిని నేతిదివ్వెలు వెలిగిస్తారు. నిర్మలమైన ఆవెలుగు నందు రంగు కనిపించదు.

బంగారము, వెండి, ఇనుము మొదలైన లోహములను నిప్పులలో కాల్చి ప్రజ్వలింపజేసినపుడు ఆయాలోహాలనుబట్టి ఆజ్వాలయందు భిన్నవర్ణములుగోచరిస్తవి. ఇచటఇంకో విశేషమేమిటంటే సూర్యకాంతిని వర్ణదర్శినితో పరిశీలిస్తే దానియం దీలోహాలుకనిపించుతవట. ఇవేకాక హేలియం అనే మరో ధాతువుకూడా సూర్యకాంతియందున్నదట. ఈహేలియమనే శబ్దం సూర్యుడనేఅర్థంగలలాటిన్‌ శబ్దం నుంచి పుట్టింది. సంస్కృతభాషయందు సూర్యుణ్ణి చెప్పే 'హేళి' అనేశబ్దమున్నది. ఈ హేలియం సూర్యునియందేతప్ప భూమియందులభించదట. ఈవిశ్వాన్ని 'హేలియో సెంట్రిక్‌' అంటారు. అంటే విశ్వానికి సూర్యుడే కేంద్రమనితాత్పర్యం. హేళిశబ్దంనుంచే హేలియో సెంట్రిక్‌ శబ్దంకూడా పుట్టిందని మనం గమనించాలి.

సూర్యకాంతికి లేనట్లే స్ఫటికానికి గూడా రంగులేదు. అంతేకాదు, నీటికిగూడా రంగులేదు. శుద్ధస్ఫటికానికి పరీక్ష ఏమిటంటే, దానిని నీటిలో వేసినపుడది కనుపించగూడదు. కంటి కగుపించు వస్తువులలో స్ఫటికానికి రంగులేనట్లే రుచి చూచే వస్తువులలో వెన్నకుగూడా రుచిలేదు. ఈరెండివలెనే నవరసాలలో శాంతముగూడ నిర్మలం, పరిశుద్ధమూను, శాంత రసమందు మనస్సు వృత్తిరహితమై, సమాధిని పొందుతుంది. రసానుభవసమయమందు మనస్సు తన్మయత్వం పొందుతుంది. కనుక శాతరసమం దది శాంతిమయమవుతుంది.

శృంగారాది రసప్రధానములైన నాటకాలు అనేకంగా వున్నవి. కాని శాంతరసనాటకాలు చాలా అరుదు. నేటి నాటకాలు చూడబోతే కామ క్రోధాదులను ప్రకోపింపజేసి మనుష్యుని అథమస్థితికికొనిపోయేవేతప్ప చిత్తశాంతినిచ్చి ఉన్నతిని కల్గించేవి కానరావు. శాంతరస ప్రధానములగు నాటకములు నేడు లేనే లేవు.

వెయ్యేండ్ల క్రితం రాజపుత్రస్థానవాసియైన కృష్ణమిశ్రుడనే కవి ప్రబోధ చంద్రోదయమనే శాంతరసప్రధానమైన నాటకం రచించాడు. దీనిని పోలినది మరొకటి లేదు. జ్ఞానమే మోక్ష సాధనమని కథారూపాన చెపుతుందీనాటకం. వివేకుడు, విష్ణు భక్తీ, శ్రద్ధ, కరుణ, ధర్ముడు, వైరాగ్యం, అజ్ఞానం మొదలైన విందు పాత్రలు, ప్రబోధమనే సామ్రాజ్యంకోసం ఇందు ఇరు తెగలకుపోరాటం జరుగుతుంది. అశాంతి కారణమైన తెగ ఓడిపోయి, జ్ఞానఫలమైన శాతిపక్షం జయంపొందుతుంది. ఈనాట కాన్ననుసరించి శ్రీ వేదాంతదేశికులుగూడ సంకల్ప సూర్యోదయమనే నాటక మొకటిరచించారు. పరమేశ్వరాను గ్రహానికి కారణమైన భక్తికి ఇందు ప్రాధాన్యం చెప్పబడింది.

నాటక ప్రదర్శనాన్ని చూడటంవల్ల చిత్తశుద్ధీ, చిత్తశాంతీ కలుగవలెనేకాని కామాదులు ప్రకోపింపకూడదు. నేటి నాటకాలు, సినిమాలూ కామాదులను ప్రకోపింపజేయుటే పనిగా పెట్టుకొని ప్రజాసంఘములకు పరస్పరద్వేషం కలిగిస్తూ ఒక్కొక్కసంఘాన్ని పరిహాసపాత్రము చేస్తూదానిపట్ల అసూయా క్రోధాలను రేకెత్తిస్తున్నవి. పూర్వం నాటక ప్రయోగంకోసం ఏర్పడినతెగనుభరతపుత్రులనేవారు. నాటకాలాడడమే వారికి స్వధర్మంగా వుండేది. వారికదే జీవనాధారమైనవృత్తి. ఇతర వృత్తులు స్వధర్మములలో గల తెగలవారు ఈనాట్యవృత్తిలో ప్రవేశిస్తేభరతపుత్రుల వృత్తికిభంగం కలిగించినవారవుతారు. అంతేకాదు, స్వధర్మమును విడనాడి పరధర్మాన్ని స్వీకరించుటచే తమధర్మానికి చేటూ, సంఘానికిహాని చేకూర్చినవారవుతారు. నాట్యజీవనులైన భరతపుత్రులకు కొన్ని నియమాలుఉండేవి. పురుషుడు స్త్రీవేషం ధరించి నటించరాదు. స్త్రీపాత్రధరించిన పురుషుని చూడడంపాపమన్నారు. నాటకంలో దంపతులవేషం ధరించే స్త్రీపురుషులు నిజంగా దంపతు లయ్యుండాలేకాని పరపురుషునకు భార్యగా స్త్రీనటింపగూడదు. నేటినాటకాలలో సినిమాలలో ఈనియమాన్ని ఉల్లంఘించటంవల్ల సంఘంలో బహిరంగంగానూ, చాటుమాటునా అవినీతి ప్రబలిపోతున్నది. ఇంతకు నేటి బాటకాలు కామాదిప్రశోపనమే పనిగా పెట్టు కొన్నవనీ, చిత్తశాంతినీ, ఆనందాన్నీ చేకూర్చే నాటకాలు మృగ్యమైనవనేదే సారాంశం.


Jagathguru Bhodalu Vol-5        Chapters        Last Page